బ్యాంక్ సర్వర్‌ హ్యాక్ చేసి రూ. 94 కోట్లు స్వాహా

SMTV Desk 2018-08-14 20:03:18  Pune, Pune Bank, 94 crore ,

రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో పాటు హ్యాకర్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇక డిజిటల్ లావాదేవీలు అధికమవుతున్న కొద్దీ హ్యాకర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మోసాలు వెలుగు చూడగా, తాజాగా హ్యాకర్ల కారణంగా ఓ బ్యాంక్ ఖజానాకి రూ.94కోట్లు గండి పడిన సంఘటన మహారాష్ట్రలోని పుణే నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… పుణే లోని కాస్మోస్ బ్యాంకు మెయిన్ బ్రాంచి సర్వర్‌‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని హ్యాకర్లు రూ. 94.42 కోట్లు స్వాహా చేశారు. భారత్, హాంకాంగ్‌ దేశాల్లోని పలు ఖాతాలకు వాటిని మళ్లించారు. అయితే ముందుగా ఈ నెల 11 సర్వర్‌ను హ్యాక్ చేసి వివిధ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.78 కోట్ల మేర ఇతర దేశాల ఖాతాల్లోకి తరలించారు. అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీ), వీసాల ద్వారా కూడా భారత్‌లోని ఓ ఖాతాకు రూ.2.5 కోట్లు తరలించడం గమనార్హం. ఇక ఇదే బ్యాంకు సర్వర్ ఈ నెల 13న మరోసారి హ్యాకింగ్ చేసి, ఈసారి హాంకాంగ్‌లో ఏఎల్ఎమ్ ట్రేడింగ్ కంపెనీ ఖాతాలోకి రూ.14 కోట్లు తరలించారు. కాగా, ఆర్బీఐ, ఇన్‌కామ్ టాక్స్ అధికారులు ఈ వ్యవహారంపై ఏఎల్ఎమ్ ట్రేడింగ్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హ్యాక్ చేసిన వారి వివరాలని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.