అయన బాగానే ఉన్నారు, మీరు అందోళన చెందకండి

SMTV Desk 2018-07-27 17:29:55  karunanidi, tamilnadu politics, aiadmk

చెన్నై, జూలై 27 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి(94) ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో కరుణానిధి బాధపడుతోన్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమనడంతో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గోపాలపురంలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హైడ్రామా నెలకొంది. అయితే కరుణ ఆరోగ్య కుదుటపడటంతో గురువారం అర్ధరాత్రి వరకు గోపాలపురంలోనే వేచి ఉ‍న్న స్టాలిన్‌, దురైమురుగన్‌ తమ నివాసాలకు వెళ్లినట్లు సమాచారం. కాగా కరుణ పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపిన స్టాలిన్‌.. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ తగ్గేంత వరకు పార్టీ నేతలెవరూ ఆయన నివాసానికి రావద్దని మనవి చేశారు. "నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. ఆందోళన చెందకండి. ఇటువంటి సమయంలో దయచేసి అందరూ సంమయనం పాటించాలని," ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరుణానిధి నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాడు డిప్యూటి సీఎం పన్నీరు సెల్వం, మంత్రి జయకుమార్‌, తంగమణి, వేలుమణి, కమల్‌ హాసన్‌, శరత్‌ కుమార్‌ తదితరులు గురువారం ఆయనను పరామర్శించారు. కాగా శుక్రవారం ఉదయాన్నే తమిళనాడు బీజేపీ అధ్యక్షులు తమిళిసై సౌందర్‌ రాజన్, సీనియర్‌ నటుడు రాధారవి, వైగో, పలువురు డీఎంకే పార్టీ నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు.