రాహుల్ హగ్ పై భగ్గుమన్న బీజేపీ..

SMTV Desk 2018-07-20 17:48:23  #rahulhug, #noconfidencemotion, bjp leaders, congress

ఢిల్లీ, జూలై 20 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ లో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా ప్రధాని నరేంద్రమోదీను ఆయన హగ్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు భాగ్గుమంతున్నారు. రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత వెళ్లి మోదీని కౌగిలించుకోవడం, ఆ తర్వాత ఆయన కన్నుకొట్టిన దృశ్యాల పట్ల ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సభలో ఎలా ప్రవర్తించాలో రాహుల్‌కు తెలియదంటూ ఎద్దేవా చేశారు. " రాహుల్‌ అనుభవ లేమి, పార్లమెంటులో ఎలా ప్రవర్తించాలనే దానిపై పరిమితులు తెలియకపోవడం కారణంగానే సభలో ఈరోజు కొన్ని విచిత్రాలు చేశారు. ఆయన చెప్పిన అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు సభను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి పనులు చేశారు. ఆయన ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా ఉంది. ఆయన ఎదిగారు కానీ ఆయనలో ఆ పరిణతి కొరవడింది" అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్‌ హేళన చేశారు. "రాహుల్‌గాంధీ సిగ్గుపడాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మా మంత్రులను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. సభలో ఆయన డ్రామా చేస్తూ.. వచ్చి మోదీని కౌగిలించుకున్నారు. ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లుగా ఉంది. ఆయన్ని మేం అక్కడికే పంపించేస్తాం’ అని బాలీవుడ్‌ నటి భాజపా ఎంపీ కిరణ్‌ ఖేర్‌ వ్యాఖ్యానించారు.