ఫ్రైడే ఫైట్.. మోదీ ట్వీట్

SMTV Desk 2018-07-20 11:46:16  #no confidence motion, bjp modi, tdp vs nda, delhi

ఢిల్లీ, జూలై 20 : విభజన హామీల అమల్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కేంద్రంపై తెలుగుదేశం యుద్ధం చేస్తోంది. కాగా ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ పార్లమెంటులో ఐదుకోట్ల ఆంధ్రులు వాణిని బలంగా వినిపించనుంది. దీంతో ఇవాళ లోక్‌సభలో జరిగే అవిశ్వాస తీర్మానంపై చర్చపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఇది చాలా ముఖ్యమైన రోజంటూ.. అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ‘ప్రజాస్వామ్యంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. అవిశ్వాసంపై నిర్మాణాత్మక చర్చ జరిగేందుకు సహచ ఎంపీలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా. దేశ ప్రజలంతా మనల్ని చాలా దగ్గరగా గమనిస్తున్నారు’ అన్నారు ప్రధాని. అవిశ్వాసంపై చర్చలో ప్రధాని సుధీర్ఘంగా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభమై.. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఓటింగ్‌ జరుగుతుంది. స్పీకర్ ఎంపీల సంఖ్యను బట్టి పార్టీలకు మాట్లాడే సమయాన్ని కేటాయించారు. అందులో బీజేపీకి 3 గంటల 33 నిమిషాలు. కాంగ్రెస్‌కు 38 నిమిషాలు కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే టీడీపీకి 13, టీఆర్ఎస్‌కు 9 నిమిషాలు ఇచ్చారు. అలాగే బీజేపీ ఎంపీ హరిబాబుకు కూడా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. సభలో మాట్లాడేందుకు సిద్ధం కావాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. ఆయనకు దాదాపు 15 నిమిషాలు కేటాయిస్తారట.