అవిశ్వాసం : ఇద్దరు ఔట్..

SMTV Desk 2018-07-19 15:17:50  #noconfidencemotion, bjd mp resignation, loksabha speaker, nda, tdp

ఢిల్లీ, జూలై 19 : ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానున్న విషయం తెలిసిందే. కాగా లోక్‌సభలో మరో ఇద్దరు సభ్యులు తగ్గారు. బిజు జనతాదళ్‌ పార్టీ ఎంపీ బైజయంత్‌ జై పాండే పదవికి రాజీనామా చేయగా, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆయన రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. అలాగే కేరళ కాంగ్రెస్‌(ఎం)కు చెందిన జోస్‌ కే మణి రాజ్యసభకు నామినేట్‌ కావడంతో లోక్‌సభలో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సభలో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని ఈరోజు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. అయితే బిజు జనతాదళ్‌ అవిశ్వాసంపై ఇప్పటివరకూ తమ వైఖరి వెల్లడించలేదు. ఒడిశాలోని కేంద్రపరా నియోజకవర్గం ఎంపీగా ఉన్న జై పండా జూన్‌ 12న తన పదవికి రాజీనామా చేశారు. అయితే నిన్న స్పీకర్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరగా ఆమె ఆమోదించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జై పండాను బిజు జనతాదళ్‌ ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి బహిష్కరించారు. సభలో ఇద్దరు సభ్యులు తగ్గడంతో స్పీకర్‌ మినహా సంఖ్యా బలం 533కు చేరింది. రాజీనామాలు చేసిన ఈ ఇద్దరు సభ్యులతో కలిపి మొత్తం 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మెజార్టీ మార్కు సంఖ్య 266గా ఉంది. లోక్‌సభలో భాజపాకు 273 సీట్లు ఉండటంతో ధీమాగా ఉంది.