చదువుకై సిద్దం కానీ.. భద్రత లేకపోతే...

SMTV Desk 2017-07-16 16:34:34  indian, students, usa studies

న్యూఢిల్లీ, జూలై 16 : భారతీయ విద్యార్ధుల చదువులకై అమెరికాకు వెళ్ళడానికి భద్రతకు సంబంధించిన భయాందోళనలు ఎక్కువయ్యాయి. అక్కడ చదువుకునేందుకు వెళ్లిన ఎక్కువమంది విద్యార్ధులను ఇదే భయం వెంటాడుతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) తాజా సర్వేలో వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో తమ వ్యక్తిగత భద్రత పై భారతీయ విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ఆందోళన ప్రభావం కనబడుతోందని... భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా ఈ సారి తగ్గవచ్చని సర్వేలో పాల్గొన్న 20 శాతం అమెరికా విద్యా సంస్థలు వెల్లడించాయి. అడ్మిషన్‌ ఖరారయ్యేంతవరకు భారతీయ విద్యార్థులతో తాము జరిపే సంప్రదింపుల్లో ఈ ఆందోళన గమనించామని 80శాతం విద్యాసంస్థలు తెలిపాయి. అమెరికన్లు తమ రాకను స్వాగతించరేమోననే ఆందోళన కూడా భారతీయ విద్యార్థుల్లో ఉందని 31 శాతం వర్సిటీలు తెలిపాయని సర్వే పేర్కొంది. అయితే దరఖాస్తుల సంఖ్య మాత్రం తగ్గలేదని వెల్లడించింది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు చైనా నుంచి ఉండగా రెండోస్థానం భారత్‌ దే. 2016లో భారత్‌ నుంచి 1,65,000 మంది విద్యార్థులు వివిధ అమెరికా వర్సిటీల్లో ఉన్నారు. ఈసారి భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గవచ్చని 20 శాతం వర్సిటీలు తెలుపుతున్నాయి. భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో పెద్దగా తేడా కనిపించకపోయినా (గతంతో పోలిస్తే) వర్సిటీల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విదేశీ విద్యార్థుల చేరికలో 2 శాతం లోటు కనిపించింది. 112 విద్యాసంస్థలు ఈ సర్వేలో పాల్గొని ఐఐఈకి గణాంకాలను అందించాయి.