అన్ని పార్టీల మద్దతు కోరిన సీఎం..

SMTV Desk 2018-07-19 12:39:42  no confidence motion, amaravthi, ap cm, bjp, loksabha

అమరావతి, జూలై 19 : ఏపీకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం (జులై 20) చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. లేఖతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్‌లెట్‌ను పంపారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని బీజేపీ మోసం చేసిందన్న ఆయన.. తిరుపతి, నెల్లూరు సభల్లో హోదాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామని.. అవిశ్వాసానికి అందరూ మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు. ఈ చర్చలో ఏపీకి హామీలపై గట్టిగా నిలదీయాలన్నారు. చర్చ 7 గంటలు జరిగే అవకాశం ఉందని.. సభలో మాట్లాడేందుకు టీడీపీకి 15 నిమిషాల సమయం వస్తుందన్నారు. 15 నిమిషాలు కాకుండా మరింత సమయం ఇవ్వాలని స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని సూచించారు.