ధోని వన్డేలకు బై..బై.. చెప్పనున్నాడా..!

SMTV Desk 2018-07-18 13:30:38  m.s.Dhoni odi retirement, dhoni, india vs england, virat kohli

లీడ్స్‌, జూలై 18 : మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ లో సారధిగా, ఆటగాడిగా, కీపర్ గా ఇంకా ఎన్నో కీలకమైన పాత్రలు వహిస్తూ.. జట్టును విజయపథంలో నడిపించాడు. ధోని చేసే ఏ పనిలోనైన ఎదో ప్రత్యేకత ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టీ-20 సిరీస్ ను దక్కించుకొని.. వన్డే సిరీస్ ను కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్‌ కోల్పోవడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు కొందరి ఆటగాళ్ల ఆటతీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనిపై తారాస్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ధోనిని ఇంకా ఎందుకు ఆడిస్తున్నావంటూ కెప్టెన్‌ కోహ్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాచ్‌ అనంతరం రిటైర్మెంట్‌కు ఊహగానాలకు తెరదీస్తూ ధోనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు జరిగిందేంటంటే... ఏ క్రికెటరైనా తాను ఆడిన చివరి మ్యాచ్‌కు సంబంధించిన బంతిని గానీ వికెట్‌ను గానీ తీసుకొని గుర్తుగా ఉంచుకుంటారు. మంగళవారం మ్యాచ్‌ జరిగిన అనంతరం ధోని అంపైర్ల నుంచి బంతి తీసుకోవడంతో ఈ మాజీ సారథి వీడ్కోలు పలుకనున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం ధోని వికెట్‌ను తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌ తర్వాతే అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ అనంతరం బాల్‌ తీసుకోవడంతో ఏ క్షణమైనా వీడ్కోలు ప్రకిటించే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.