ధోని నా ఆటను గుర్తుచేశాడు : సునీల్ గవాస్కర్

SMTV Desk 2018-07-17 16:19:55  sunil gavaskar, m.s.dhoni, england tour of india, lords stadium

లండన్‌, జూలై 17 : ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు మూడు వన్డేల సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీమిండియా మొదటి మ్యాచ్‌లో నెగ్గి.. రెండో వన్డే లో ఓటమి పాలైంది. ఈ రోజు ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక చివరి వన్డే జరగనుంది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఎంఎస్‌ ధోని ఆడిన ఇన్నింగ్స్‌ తన గత చెత్త ప్రదర్శనను గుర్తుకు తెచ్చిందని భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. లార్డ్స్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని 57 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దాంతో అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు ధోని ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలంటూ విమర్శలు గుప‍్పించారు. దీనిపై గావస్కర్‌ కూడా మాట్లాడుతూ.. "లార్డ్స్‌ మైదానంలో ఎంఎస్‌ ధోని ఆడిన ఇన్నింగ్స్‌ 1975లో ఇంగ్లిష్‌ గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో వారితో ఇదే మైదానంలో నేను ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది. అప్పుడు ఆ మ్యాచ్‌లో నేను సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేసి అజేయంగా 36 పరుగులు చేశాను. ఇందులో ఒకే ఒక ఫోర్‌ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. నా క్రికెట్‌ కెరీర్‌లోనే ఇదో చెత్త ఇన్నింగ్స్‌. ఇప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్‌నే ధోని ఆడాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్‌ విజయం అసాధ్యంగా మారింది. అలాంటి సమయంలో అతను మాత్రం ఏం చేయగలడు. వీలైనంత త్వరగా జట్టు ఆలౌట్‌ అవ్వకుండా ఉండేందుకు ధోని అలా ఆడి ఉంటాడు. అది టీమిండియా గేమ్‌ ప్లాన్‌లో భాగం కావొచ్చు’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు.