సీఎం వ్యాఖ్యలతో కదిలిన టీటీడీ బోర్డు..

SMTV Desk 2018-07-17 11:56:54  ttd board, ttd board eo anil singhal, chandrababu naidu, tirupathi

తిరుమల, జూలై 17 : మహా సంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజుల పాటు పూర్తిగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం అధికారులతో చర్చించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆగమ శాస్త్రానుసారమే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తితిదే, సీఎంవో అధికారులను ఆదేశించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని సూచించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని అన్నారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్పందించారు. టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో చైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని ఈఓ తెలియజేశారు. అయితే, సమావేశం కంటే ముందు దర్శనాల విషయంలో భక్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని.. మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలపై విదివిధానాల గురించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం బోర్డు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ వ్యాఖ్యానించారు. జులై 24న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా పెద్ద సంఖ్యలో వస్తే మిగతావారు ఇబ్బంది పడతారనే గతంలో ఆ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించారు.