రాహుల్ కు ప్రధాని అయ్యే అవకాశం లేదు : బీఎస్పీ

SMTV Desk 2018-07-17 11:42:40  bsp leader mayawati, mayawati, pm candidate mayawati, lucknow

లక్నో, జూలై 17 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాయావతికి ప్రకటించాలని బీఎస్పీ కోరింది. విదేశీ మూలాలున్న సోనియా గాంధీకి జన్మించడం వల్లన రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని ఆ పార్టీ పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించేందుకు సోమవారం పార్టీ ఉన్నత స్థాయి సమావేశాన్ని లక్నోలో నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్‌కి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించి, విశేష అనుభవం కలిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని బీఎస్సీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలను ఏదుర్కొనే శక్తి కేవలం మాయావతికే ఉందని.. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒకటి చేయడం కోసం మాయావతి తీవ్రంగా కృషి చేస్తున్నారని సీనియర్‌ నేత వీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న రాహుల్‌ కంటే దేశ ప్రధాని అయ్యే అర్హతలు మాయావతికే ఉన్నాయన్నారు. అమె కేవలం దళితల పక్షపాతి కాదని దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మాయావతికి మద్దతు లభిస్తోందని తెలిపారు. కాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. బీఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలూనీ స్పందిస్తూ.. దేశానికి నాయకత్వం వహించాలని అనుకోవడంలో తప్పలేదని, ప్రస్తుతం లోక్‌సభలో ఒక్క సీటు కూడా లేని పార్టీ ప్రధానమంత్రి పదవి గురించి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.