లాల్ దర్వాజా అమ్మవారికి...కవిత బంగారు బోనం

SMTV Desk 2017-07-16 11:16:28  ashada bnam, laldarwaja, mp kavitha

హైదరాబాద్, జూలై 16 : తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ బోనాల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు దర్పణం పట్టే లాల్ దర్వాజా బోనాలు నగరంలో వైభవంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్దయెత్తున ఆలయానికి తరలివస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత సింహవాహిని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకముందు బోనాల పండుగ కోసం 20 ఆలయాలకు కూడా నిధులు ఇచ్చేవారు కాదని అన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు ప్రభుత్వం నిధులు కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కవిత వెల్లడించారు. ఈ బోనాల సందర్భంగా ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్ గౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ లు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.