ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం..

SMTV Desk 2018-07-14 17:21:24  delhi pollution, delhi air pollution, ppm, china,

ఢిల్లీ, జూలై 14: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం వీపరితంగా పెరిగిపోయింది. కేవలం 2016 ఒక్క ఏడాదిలోనే ఢిల్లీలో దాదాపు 15వేల మంది కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఓ సర్వే వెల్లడించింది. గాలిలోని సన్నని ధూళికణాల (ఫైన్‌ పర్టిక్యులేట్‌ మ్యాటర్) కారణంగా జీవనకాలం కంటే ముందుగానే 14,800 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా విష పూరితమైన గాలి కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన నగరాల జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం గాలి కాలుష్యం ప్రధాన ముప్పుగా మారిందని, దీన్ని అధిగమించేందుకు పటిష్ఠమైన ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అవసరమని సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ అనుమిత రాయ్‌చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరాడేందుకు భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్‌ ప్రీమియర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోందని అన్నారు. విష పూరితమైన గాలి కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన నగరాల జాబితాలో చైనాలోని షాంఘై తొలి స్థానంలో ఉంది. అక్కడ 2016లో 17,600 మంది జీవనకాల పరిమితికి ముందుగానే చనిపోయారు. 18,200 మరణాలతో బీజింగ్‌ రెండో స్థానంలో ఉంది. గాలిలోని పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 కారణంగా ఈ మరణాలు సంభవించినట్లు సర్వే తెలిపింది. గాలిలో పీఎం2.5 కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులతో పాటు క్యాన్సర్‌ తదితర వ్యాధులు వస్తాయి. రకరకాల జబ్బులతో జీవనకాలం తగ్గిపోయి ముందుగానే మరణం సంభవిస్తాయి.