ఎన్నికల విధులకు బ్యాంకు అధికారులు..

SMTV Desk 2018-07-14 15:01:23  pakistan elections, pakistan election commission, don paper, islamabad

ఇస్లామాబాద్‌, జూలై 14 : సాధారణంగా ఎన్నికల కోసం ఉపాధ్యాయులను నియమిస్తుంటారు. కానీ తొలిసారిగా బ్యాంకు ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. ఈనెల 25న పాక్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం దాదాపు 7.35లక్షల సిబ్బంది అవసరమని ఈసీపీ అంచనా వేస్తోంది. పాకిస్థాన్‌ చరిత్రలోనే ఇది తొలిసారి అని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్యాంకర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాలనే నిర్ణయాన్ని పాక్‌ ఎన్నికల కమిషన్‌ (ఈసీపీ) తీసుకుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్యాంకులకు నోటీసులు ఈసీపీ పంపించినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు శిక్షణ తీసుకునేందుకు సహకరించాల్సిందిగా ఈసీపీ సదరు నోటీసుల్లో పేర్కొంది. ఈ విధానాన్ని ఇప్పటికే సింధ్‌లో ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎన్నికల సిబ్బంది కొరత ఉండటం వల్లే ఈసారి బ్యాంకర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది.