డీసీఐను ప్రైవేటీకరించే ఆలోచన లేదు : గడ్కరీ

SMTV Desk 2018-07-13 17:15:24  nitin gadkari, vishaka port, dci, sagar mala project

విశాఖ, జూలై 13 : విశాఖ పోర్టుకి కొత్తగా భూమి లభించే అవకాశం లేనందున ఈ పోర్టుపై ఒత్తిడి తగ్గాలంటే కొత్త పోర్టు అవసరమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇందుకోసం ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు అభివృద్ధికి మూడు వేల ఎకరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకు లేఖ రాస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. విశాఖలో రెండు రోజుల పాటు దేశంలోని మేజర్ పోర్టుల పనితీరు, ఈ ఏడాది అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఆయన సహాయ మంత్రులతో కలిసి సమీక్షించారు. సమీక్ష వివరాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. పోర్టుల అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించామని తెలిపారు. ఇందులో భాగంగానే అక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అన్ని పోర్టుల సదుపాయాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ వెల్లడించారు. సాగర్ మాల, భారత్ మాల ప్రాజెక్టుల వల్ల దేశంలో జలరవాణా పూర్తిస్థాయిలో అభివృద్ది చెందుతుందన్నారు. ఏపీకి ఈ ప్రాజెక్టులు, ఇతర పథకాల కింద రూ.4లక్షల కోట్లకు పైగా మంజూరు చేసినట్టు వివరించారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అఫ్ ఇండియా (డీసీఐ) ప్రైవేటీకరించే యోచన లేదని.. విశాఖ, పారదీప్, న్యూమంగళూరు పోర్టులు దీని బాధ్యతను తీసుకుంటాయని గడ్కరీ వ్యాఖ్యానించారు.