ఈవో ఇంటిపై అనిశా దాడులు

SMTV Desk 2017-07-15 18:12:37  Department, of, Corruption, in, Eao, Srinivas, house

నెల్లూరు, జూలై 15 : అవినీతి నిరోధక శాఖ చేతికి మరొకరు చిక్కారు. దేవస్థానం ఈవో పొరెడ్డి శ్రీనివాసులురెడ్డి అక్రమాస్తులు పోగేసారని అవినీతి నిరోధక శాఖ గుర్తించారు. ఈ దాడుల్లో 10 కోట్లు కూడబెట్టి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపణతోనే అనిశా దాడులు నిర్వహించింది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట కలెక్టర్ బంగ్లా సమీపంలోని బషీర్ నగర్ లో నివాసముంటున్న శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై అనిశా అధికారులు దాడులు చేసారు. అలాగే ఒంగోల్ లో నివాసముంటున్న శ్రీనివాస్ తల్లిదండ్రుల ఇంటితో పాటు నెల్లూరు రంగనాథ స్వామి ఆలయ కార్యాలయం, సీనియర్ అసిస్టెంట్ మాధవి, పూజారి జగన్నాధ చార్యులు, స్నేహితుడు అమర్ రెడ్డి ల ఇళ్ళను అనిశా అధికారులు సోదాలు చేసారు. నెల్లూరు లో 4 ప్రాంతాలు, ఒంగోలు లో ఒక ప్రాంతం బంధువులు, స్నేహితులు, బీనామీ ల ఇళ్ళ పై ఒకేసారి ఆరు బృందాలతో తనిఖీలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో 2 ఇళ్ళు, 7 ఇళ్ళ స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 250 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి, రూ. 1.05 లక్షల నగదు ఈ దాడుల్లో దొరికాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి విలువ రూ. 10 కోట్ల పైనే ఉంటుందని అనిశా అధికారుల అంచనా. ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే అవినీతికి పాల్పడ్డాడని అనిశా అధికారులు ఆరోపించారు. ఈ తనిఖీల్లో నెల్లూరు అనిశా డీఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌రెడ్డి లు పాల్గొన్నారు.