కాంగ్రెస్ లో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి ..

SMTV Desk 2018-07-13 12:43:42  nallari kiran kumar reddy, kirankumar reddy joins congress, rahu gandhi, ycp vs congress

ఢిల్లీ, జూలై 13 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. కిరణ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్‌ చాందీ, అశోక్‌ గెహ్లాట్‌, పళ్లంరాజు, రఘువీరారెడ్డి తదితర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాహుల్‌తో భేటీ అయ్యేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆయన తిరిగి కాంగ్రెస్‌ చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి పెరిగింది. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా దస్త్రం మీదే చేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సభలు, సమావేశాల్లో చెబుతూ ప్రజల్లో బలంగా నాటుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు పార్టీకి అవసరమని నేతలు భావిస్తున్నారు. అందుకే సీనియర్‌ నేతలు పలు విడతలుగా ఆయనతో భేటీ అయి పార్టీలో చేరాలని కోరారు. సుదీర్ఘ మంతనాల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి సొంత‌ పార్టీ పెట్టుకున్న వైఎస్‌ జగనే తమ లక్ష్యం అని చెబుతున్న నేతలు.. కిరణ్‌ చేరికతో ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.