వార్తా చానళ్లకు తెలంగాణ సర్కారు హెచ్చరిక..

SMTV Desk 2018-07-12 12:53:19  telangana government, news channel, hyderabad, dgp of telangana

హైదరాబాద్‌, జూలై 12: మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఓ వార్తా చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీపీఠం మఠాధిపతి పరిపూర్ణానందస్వామి హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్రకు పూనుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. మతపర సున్నిత అంశాలపై కొన్ని వార్తా చానళ్లు అభ్యంతరకర రీతిలో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రభుత్వా నికి పోలీసు శాఖ నివేదించింది. దీంతో చానళ్ల ప్రసారాలపై నిఘా ఉంచాలని, రెచ్చగొట్టేలా ప్రసారాలు జరిపితే చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. డీజీపీ సూచనల మేరకు వార్తా చానళ్ల ప్రసారాలను నిరంతరం సమీక్షించడానికి హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.