ఫేస్‌బుక్‌కు వీడని కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం..

SMTV Desk 2018-07-11 18:06:58  facebook fine, Cambridge Analytica, london, social media fb

లండన్, జూలై 11 : ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ను కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే అమెరికా, యూకేల్లో ఫేస్‌బుక్‌ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. తాజాగా బ్రిటన్‌ డేటా రెగ్యులేటర్‌ కూడా ఫేస్‌బుక్‌పై చర్యలు చేపట్టింది. యూజర్ల డేటాను భద్రంగా ఉంచడంలో విఫలమైనందున ఆ సంస్థపై 5లక్షల పౌండ్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.4కోట్లకు పైనే) జరిమానా విధించనున్నట్లు ఆ దేశ డేటా నియంత్రణ సంస్థ తెలిపింది. డేటా ప్రొటెక్షన్‌ చట్టం కింద గరిష్ఠ జరిమానా విధించాలని తాము భావించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తరఫున పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ సమస్యల్లో పడింది. ఈ వ్యవహారంపై కంపెనీ స్పందించి.. పొరబాటు తమదేనని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆఫీస్‌ కూడా ఫేస్‌బుక్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టింది. ఫేస్‌బుక్‌లో యూజర్ల డేటాకు భద్రత ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టింది. అందులో ఫేస్‌బుక్ విఫలమవడంతో సంస్థపై జరిమానాను విధించేందుకు సిద్ధమైంది. డేటా ప్రొటెక్షన్‌ చట్టం కింద గరిష్ఠ జరిమానా విధించాలని తాము భావించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.