జమిలికి జై కొట్టిన వైసీపీ..

SMTV Desk 2018-07-10 15:43:57  jamili elections, law commission, ycp, ycp mp vijay sai reddy

ఢిల్లీ, జూలై 10 : : దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జమిలి ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్‌కు ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిసి లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అభిప్రాయాన్ని జాతీయ న్యాయ కమిషన్‌కు అందజేసినట్టు వెల్లడించారు. జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రంలో హంగ్‌ఏర్పడితే పరిస్థితి ఏమిటని న్యాయ కమిషన్‌కు అడిగామని.. ఏ ప్రభుత్వమైనా కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని విజయసాయి ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పదవికి బీజేపీ, మిత్ర పక్షాలు అభ్యర్థిని నిలబెడితే మాత్రం తాము మద్దతివ్వబోమని స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలకు రాజకీయ పార్టీలు జాతీయ న్యాయ కమిషన్‌ నిర్వహించిన సంప్రదింపుల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. ఇప్పటివరకు నాలుగు పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు జైకొట్టగా.. తొమ్మిది పార్టీలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు న్యాయ కమిషన్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించడంతో జమిలికి జైకొట్టిన పార్టీల (టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ) సంఖ్య ఐదుకు చేరింది.