ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..

SMTV Desk 2018-07-10 13:43:57  mumbai heavy rains, mumbai non stop rains, greater mumbai, west railway

ముంబై, జూలై 10 : ముంబయి మహా నగరాన్ని రెండ్రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పశ్చిమ రైల్వే సబర్బన్‌ సర్వీసులు నిలిచిపోయాయని సీనియర్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. రాత్రి నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్ లపై నీరు భారీగా చేరడంతో పలు రైళ్ళును రద్దు చేశారు. ఉదయం పలు రైళ్ల నిలిపివేయడం, కొన్ని ఆలస్యం కావడంతో నగరంలో కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్‌ ముంబయి, థానే, రాయిగఢ్‌, పాల్‌గఢ్‌ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని తెలిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు మంచి నీరు సరఫరా చేసే తులసి సరస్సు పొంగి ప్రవహిస్తోంది. కార్యాలయాలకు టిఫిన్‌ బాక్సులు చేరవేసే డబ్బావాలాలు ఈరోజు నగరం మొత్తానికి తమ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.