వ్యవసాయానికి 58వేల కోట్లు..

SMTV Desk 2018-07-10 12:00:07  agriculture loans, slbc, telanagana, swaminathan

హైదరాబాద్, జూలై 10 : రైతు రుణాలతో పాటు వివిధ రంగాల్లో నిరర్ధక ఆస్తులుగా మిగిలిన ఆస్తులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఛైర్మన్ స్వామినాథన్ వెల్లడించారు. రాష్ట్రంలో రైతు రుణాలతో పాటు, ప్రాధాన్య, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1.36 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బ్యాంకుల వారీగా నిర్దేశించుకున్న రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం పూర్తి చేస్తామని బ్యాంకులు ధీమా వ్యక్తం చేశాయి. లక్షా ముఫ్పై ఆరు వేల కోట్ల రూపాయల మేర 2018-19 ఆర్థిక ఏడాదిలో వివిధ రంగాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిన బ్యాంకర్లు, వ్యవసాయం దాని అనుబంధ విభాగాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ వెల్లడించారు. ఎస్.ఎల్.బి.సి ఛైర్మన్‌గా వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు రుణాలు సకాలంలో అందేట్లు చూస్తామన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 80 శాతం రుణాలు ఇచ్చామని, ఈ ఏడాదీ ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.