కారాగారంలో కడతేర్చాడు..

SMTV Desk 2018-07-09 12:23:45  Gangster Munna Bajrangi, Gangster Munna Bajrangi shot dead, UP Jail, lucknow

లక్నో, జూలై 9 : గ్యాంగ్‌స్టర్‌ మున్నా బజరంగిపై సోమవారం ఉదయం తోటి ఖైదీ కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్ జైల్లో చోటుచేసుకుంది. ఝాన్సీ నుంచి ఆదివారమే భజరంగిని బాఘ్‌పత్ జైలుకు తరలించారు. నా భర్తకు ప్రాణహాని ఉందని మున్నా భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ హత్య జరగడం గమనార్హం. అలాగే బీజేపీ నేత హత్య కేసులో అతడిని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఇంతలోనే హత్యకు గురయ్యాడు. తోటి ఖైదీలో కలిసి టీ తాగుతోన్న మున్నాపై సునిల్ రాథి అనే ఖైదీ కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ న్యాయ విచారణకు ఆదేశించి, జైలర్‌ను విధుల నుంచి తప్పించారు. జైలు ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, దీనిపై లోతుగా దర్యాప్తు చేసి, అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి స్పష్టం చేశారు. మరోవైపు మున్నా హత్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ప్రతిపక్షాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపించాయి. మున్నా బజరంగి అసలు పేరు ప్రేమ్‌ ప్రకాశ్‌.. బీజేపీ నేత కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 2009 అక్టోబరులో అతడిని అరెస్ట్‌ చేశారు. కృష్ణానంద్‌ రాయ్‌పై ఏకే 47తో 100 రౌండ్లు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చాడు. అలాగే ఓ వ్యాపారిని రూ.కోటి ఇవ్వాలని బెదిరించిన కేసులోనూ అరెస్టయ్యాడు. మున్నాపై పలు హత్య కేసులతోపాటు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. నేర చరిత్ర కలిగిన మున్నా 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.