హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌

SMTV Desk 2018-07-07 11:56:00  Thottathil Bhaskaran Nair Radhakrishnan, high court chief justice, ap, ts , hyderabad

హైదరాబాద్, జూలై 7 ‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణం స్వీకారం చేశారు. హైకోర్టు 93వ చీఫ్‌ జస్టిస్‌గా (ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్‌ 4వ సీజే) తాజాగా ఆయన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ రాధాకృష్ణన్‌చే సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్‌ ప్రొఫైల్.. 1959 ఏప్రిల్‌ 29న తొట్టథిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ జన్మించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆయన బెంగళూరు వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని 1983 డిసెంబరు 11న న్యాయవాదిగా పేరు రిజిస్టర్ చేసుకున్నారు. జూనియర్‌ న్యాయవాదిగా తిరువనంతపురంలో వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. సివిల్‌, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేటివ్‌ ‘లా’కు సంబంధించిన కేసుల్లో పేరు గడించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2004లో నియమితులై..అక్కడే 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. పదోన్నతిపై 2017 ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.