రెండో టీ-20 ఇంగ్లీష్ జట్టుదే..

SMTV Desk 2018-07-07 11:19:47  india vs england, england won, alex hales, virat kohli

కార్డిఫ్, జూలై 7 : సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు భారత్ పై ప్రతీకారం తీర్చుకోంది. మూడు టీ-20ల సిరీస్ లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ప్రత్యర్ధి జట్టులో హేల్స్‌ (58 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4, 3×6) మెరిసిన వేళ టీమ్‌ఇండియాను5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కార్డిఫ్‌ పిచ్‌ నెమ్మదైనది కావడంతో పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడ్డారు. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ (5), ధావన్‌ (10)లు నిరాశపరచగా.. ఫస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో రాహుల్ 6 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారత్ 22 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (47: 38 బంతుల్లో 1x4 6x2).. సురేష్ రైనా (27: 20 బంతుల్లో 2x4, 1x6) స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. తర్వాత వాళ్లిద్దరూ పెవిలియన్‌కు చేరగా.. చివరలో ధోనీ (32:24 బంతుల్లో 5x4), పాండ్యా(12) రాణించడంతో భారత్ 148 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య చేధనలో హేల్స్‌, బెయిర్‌స్టో (28; 18 బంతుల్లో 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి రాగా.. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌ బాదిన హేల్స్‌ జట్టును విజయపథంలో నడిపించాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, భవనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్యా, చహల్‌ తలో వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ-20 ఆదివారం జరగనుంది.