తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన కుమారస్వామి..

SMTV Desk 2018-07-05 16:15:51  karnataka budget 2018, congress-jds 2018, hd. kumara swami, karnataka

కర్ణాటక, జూలై 5: కర్ణాటకలో కొలువు దీరిన జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మర్నాడే రైతు రుణాలను పూర్తిగా మాఫీచేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. విధాన సభ సాక్షిగా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణం ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌‌లో రూ.2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ.34,000 కోట్ల కేటాయించినట్టు తెలియజేశారు. ఈ పథకం ప్రకారం రూ.2లక్షల వరకు పంటరుణం మాఫీ అవుతుంది. వాళ్లు తిరిగి కొత్త రుణాలు తీసుకోవచ్చు. అలాగే గడువులోపు రుణాలు తిరిగి కట్టేసిన రైతులకు ప్రోత్సాహకంగా రూ.25వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో కుమారస్వామి వెల్లడించారు. పెట్రోల్‌పై ప్రస్తుతమున్న 30శాతం పన్నును 32శాతానికి, డీజిల్‌పై 19శాతం నుంచి 21 శాతానికి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.1.14, డీజిల్‌ లీటరుకు రూ.1.12పైసలు పెరుగుతుందని స్పష్టం చేశారు. రూ.211కోట్ల వ్యయంతో ఇందిరా క్యాంటీన్లను విస్తృతం చేస్తామని.. దేశీయ మద్యంపై అదనంగా 4శాతం ఎక్సైజ్‌ సుంకం పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.