మూఢనమ్మక౦తో.. 350 కిలోమీటర్లు..

SMTV Desk 2018-07-05 12:50:47  h.d.revanna escape bad luck, Public works minister HD revanna, karnataka

బెంగళూరు, జూలై 5 : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళా మూఢనమ్మకాలు నమ్మేవారు లేకపోలేదు. మన దేశంలో రాజకీయనాయకులూ వీటికి అతీతులేమి కాదు. తాజాగా ఓ మంత్రి ఓ ఏకంగా ఓ జోతిష్యుడు చెప్పిన మాటలు విని 350 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాడు. అతనెవరో కాదు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవన్న. ఆయన పీడబ్ల్యూడీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే రేవన్నకు ఇంకా ప్రభుత్వం అధికారిక వసతి ఏర్పాటుచేయలేదు. ఆయనకు బాణశంకరి ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అయితే రేవన్న రాత్రిళ్లు తన సొంతింట్లో ఉండకూడదని రోజూ బెంగళూరు నుంచి హోలెనరసిపుర వరకు ప్రయాణాలు చేస్తున్నారు. రేవన్న జోతిష్యాన్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే బెంగళూరులోని తన సొంతింట్లో రాత్రిళ్లు నిద్రపోవడం మంచిది కాదని, అలా చేస్తే చెడు జరుగుతుందని రేవన్నకు ఓ జోతిష్యుడు చెప్పాడట. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలోనే ఉండాలని ఆ జ్యోతిషుడు సలహా ఇచ్చాడు. కానీ రేవణ్ణ కోరుకుంటున్న కుమార పార్క్ వెస్ట్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లా ఇంకా ఖాళీ అవలేదు. ఈ బంగ్లాలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని కర్ణాటక రాజకీయ నేతలు నమ్ముతారు. ప్రస్తుతం ఈ బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌సీ మహాదేవప్ప ఉంటున్నారు. బంగ్లా ఖాళీచేయడానికి ఆయన మూడు నెలల గడువు అడిగాడు. 2013 నుంచి ఇదే బంగ్లాలో ఉంటున్న మహాదేవప్ప... శక్తివంతమైన మంత్రిగా అవడానికి దోహదపడిందని నమ్ముతారు. తనకు కూడా ఇదే బంగ్లానే కావాలని పట్టుబడుతున్న మంత్రి రేవణ్ణ.. ఖాళీ అయినంత వరకూ వేచి ఉంటానని అన్నట్టు అధికారులు తెలిపారు. అంత వరకు బెంగళూరు నుంచి హోళినరసపురకు తిరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే రేవన్న రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి పూజా కార్యక్రమలు ముగించుకుని నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటారు. అనంతరం ఉదయం 8 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11.30 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి అర్థరాత్రి హోళినరసపుర చేరతారు. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించడం విశేషం. అంతేకాదు ఈయన వాహనం కోసం ట్రాఫిక్ ఫ్రీ కారిడార్ కూడా ఏర్పాటుచేశారు.