21న అలుముకోనున్న అంధకారం

SMTV Desk 2017-07-14 16:51:02  AMERIKAA,SKY, POWER SYSTEM, SOLAR ECLIPSE, DARKNESS, SOLAR SYSTEM.

వాషింగ్టన్, జూలై 14 : చాలా ఏళ్ల తరువాత అత్యంత అరుదైన సూర్యగ్రహణం కారణంగా ఆగస్టు 21న అమెరికా వాసులను అంధకారం అలుముకోనుంది. ఆ దృశ్యాలను వీక్షించేందుకు ఓ వైపు ప్రజలు సంతోషంతో సన్నద్ధం అవుతుంటే.. మరోవైపు మాత్రం ఆరోజున సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడనుందని పలువురు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆకాశమంతా చీకటిమయం కానుండటంతో సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుందని ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. సూర్యగ్రహణం ప్రభావంతో దాదాపు 7 మిలియన్‌ ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోనుందట. ఇది 9 న్యూక్లియర్‌ రియాక్టర్లలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సమానమని విశ్లేషకులు తెలిపారు. సూర్యగ్రహణం ప్రభావంతో అమెరికాలోని ఓరెగాన్‌ ప్రాంతం నుంచి దక్షిణ కరోలినా ప్రాంతం వరకు అనగా 113 కిలోమీటర్ల మేర చీకటి కానుంది. ఈ కారణంగా భారీ సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, ఇళ్లపై సౌర శక్తి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ ఇంచుమించు 9 వేల మెగావాట్ల వరకు తగ్గిపోనుందని బ్లూమ్‌బర్గ్‌ అనే సంస్థ అంచనావేస్తోంది. తూర్పు అమెరికా ప్రాంతంలో అతిపెద్ద పవర్‌ గ్రిడ్‌ అయిన పీజేఎం ఇంటర్‌ కనెక్షన్‌ ఎల్‌ఎల్‌సీ దీనిపై స్పందిస్తూ.. సూర్యగ్రహణం కారణంగా తమ ప్లాంట్‌లో 2,500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి తగ్గిపోనుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. విద్యుత్‌ ధరలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కాగా అమెరికా వాసులు చివరిసారిగా 1979లో పూర్తిగ్రహణాన్ని వీక్షించినట్లు నాసా తెలిపింది.