రైల్వే జోన్‌ టీడీపీ ఎంపీల దీక్ష..

SMTV Desk 2018-07-04 12:16:13  tdp leaders protest, tdp leaders protest, tdp deeksha for railway zone, visakhapatnam

విశాఖపట్నం, జూలై 4 : విభజన హామీల అమలు కోసం అధికార టీడీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. మొన్న కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. విశాఖ రైల్వే జోన్ కోసం పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌ సమీపంలోని కాన్వెంట్‌ జంక్షన్‌లో విశాఖ రైల్వేజోన్‌ సాధన కోసం ఆ పార్టీలు బుధవారం నిరశన చేపట్టారు. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఉదయం 8 గంటలకు ఆర్కేబీచ్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులంతా ప్రదర్శనగా దీక్ష శిబిరం ప్రాంగణానికి చేరుకున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వచ్చేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. కేంద్రంతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా స్పందన లేదని.. రైల్వేజోన్‌పై నాలుగేళ్లుగా పరిశీలిస్తున్నామని చెబుతున్నారు తప్ప ఎలాంటి ముందడుగు పడలేదన్నారు. విభజన హామీల్లో ఓ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేసిందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విభజన హామీలు అమలు చేస్తారని నాలుగేళ్లుగా ఎదురుచూసినా నిరాశే ఎదురైందని అన్నారు.