చిక్కుల్లో పడ్డ భారత్ క్రికెటర్..

SMTV Desk 2018-07-03 18:35:48  Harmanpreet Kaur fake certificates, dsp job of Harmanpreet Kaur. india cricket t-20 captain Harmanpreet Kaur,

అమృతసర్, జూలై 3 : భారత మహిళల టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చిక్కుల్లో పడింది. ఆమె ఈ ఏడాది మార్చిలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించి పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించిందని తాజాగా ఆరోపణలు వెలువడుతున్నాయి. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఒంటిచేత్తో టీమిండియాను ఫైనల్‌కి చేర్చింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఆమె అద్భుత ప్రదర్శనకు మెచ్చి డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్‌లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్‌ బోగస్‌ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తనపై ఆరోపణలు రావడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. "నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరాననే ఆరోపణల్లో నిజం లేదు. అయినా.. అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. పంజాబ్ పోలీసు శాఖతో మాట్లాడిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాను" అని హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించింది.