దాడిని కలిసిన జనసేనాని..

SMTV Desk 2018-07-03 17:09:54  dadi veerabhadra rao, janasena chief pawan kalyan, dadi veerabhadra rao, anakapalli

అనకాపల్లి, జూలై 3 : జనసేన పార్టీ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగుతుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగి ప్రారంభమైంది. సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్.. మంగళవారం విశాఖ జిల్లాలో పర్యటన ప్రారంభించారు. విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. తర్వాత అనకాపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో జనసేనానిని భేటి అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనే దిశగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చిన దాడి వీరభద్ర రావు తర్వాత జగన్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ పార్టీలో ఎంతో కాలం ఉండలేకపోయారు. కొడుకు రత్నాకర్‌తో కలిసి జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇన్నేళ్లపాటు తటస్థంగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తిరిగి వైఎస్ఆర్‌సీపీలో చేరతారనే వార్తలొచ్చాయి. గత ఏప్రిల్‌లో దాడి అనూహ్యంగా జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ అయ్యారు. తామిద్దరం విమానాశ్రయంలో అనుకోకుండా కలిశామని దాడి చెప్పారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దాడి గంటాను కలవడంతో ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు వెలువడ్డాయి. కానీ పవన్ తాజాగా దాడి ఇంటికెళ్లడంతో ఆయన జనసేనలో చేరడం దాదాపు ఖాయమైనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.