రూ.1 కట్టలేదని.. రూ 3.5 లక్షల బంగారం ఆపేశారు..!

SMTV Desk 2018-07-02 18:23:10  chennai loan matter, 1 rupee issue for banks, chennai, bank vs customer

చెన్నై, జూలై 2 : వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశాల దాటిపోయే బడాబాబులను ఏమి చేయలేని బ్యాంకులు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. బ్యాంకు అధికారుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. కేవలం రూపాయి.. ఒకే ఒక్క రూపాయి బకాయి ఉన్నాడనే నేపంతో దాదాపు 3.50 లక్షల రూపాయల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఓ వ్యక్తిని వేధిస్తున్నారు బ్యాంకు అధికారులు. దాంతో లాభంలేదని భావించిన బాధితుడు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. వివరాల్లోకి వెళితే... సి. కుమార్ అనే వ్యక్తికి కాంచీపురం సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకు పల్లవరం బ్రాంచిలో ఖాతా ఉంది. 2010 ఏప్రిల్‌లో ఆయన 131 గ్రాముల బంగారం తనఖా పెట్టి రూ.1.23 లక్షలు రుణం తీసుకున్నాడు. తర్వాత మళ్లీ రెండు సార్లు 138 గ్రాముల బంగారం తనఖా పెట్టి రూ. 1.65 లక్షల మేర రుణం తీసుకున్నాడు. 2011 మార్చిలో తొలిసారి తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేసి 131 గ్రాముల బంగారాన్ని విడిపించుకున్నాడు. తర్వాత కొద్దిరోజులకే మిగతా రెండు లోన్లు కూడా కట్టేశాడు. అయితే ఈ రెండు రుణాలకు సంబంధించి రికార్డుల్లో చెరో 1 రూపాయి కట్టాల్సి ఉందని చెబుతూ బ్యాంకు అధికారులు నగలు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఒక్కొక్క రూపాయి కడతానని చెప్పినప్పటికీ అధికారులు ఆ డబ్బులు తీసుకునేందుకు గానీ, నగలు తిరిగి ఇచ్చేందుకు గానీ అంగీకరించలేదు. ఒక్క రూపాయి కోసం రూ. 3.5 లక్షల విలువైన బంగారం బ్యాంకులో ఉండిపోవడంతో బాధితుడు ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగాడు. చివరికి మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం జస్టిస్ టి. రాజా దీనిపై విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార్‌ వాదనలను కోర్టు రికార్డు చేసింది. అంతేకాక కుమార్‌ తరుపు ప్రభుత్వ న్యాయవాది సత్యనాధన్‌కు రెండు వారాల్లోగా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తన ఆభరణాలు పోయుంటాయని, అందుకే అధికారులు రుణం చెల్లించిన తర్వాత కూడా తనను ఇ‍బ్బంది పెడుతున్నారని కుమార్‌ వాపోయారు.