ఏటీఎంలో చిక్కుకున్న వ్యక్తి

SMTV Desk 2017-07-14 14:35:46  TEXAS, ATM, HELPING, POLICE, ELACTONIC LOCK.

టెక్సాస్, జూలై 14 : ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఏటీఎం నుంచి డబ్బులతోపాటు, ‘నన్ను రక్షించండి.. నేను ఏటీఎంలో ఇరుక్కుపోయాను’ అని రాసి ఉన్న చీటీలు కూడా వచ్చిన సంఘటన టెక్సాస్ లోని ఓ ఏటీఎం వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కార్పస్‌ క్రిస్టీ ప్రాంతంలోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కేంద్రంలో ఎలక్ట్రానిక్‌ లాక్‌ను మార్చేందుకు ఓ కార్మికుడు ఏటీఎం అమర్చిన గది లోపలి వైపునకు వెళ్లి అనుకోకుండా అందులో చిక్కుకుపోయాడు. అతను తన మొబైల్ ను కూడా ట్రక్కులో మరిచిపోవడంతో తాను అందులో చిక్కుకున్న విషయాన్ని బయటకి చెప్పలేకపోయాడు. అలా రెండు గంటలు గడిచిపోయినా అందులోంచి బయటకి వచ్చే మార్గం మాత్రం అతనికి కన్పించలేదు. చివరికి ఓ ఆలోచన వచ్చి చీటీలపై "నన్ను రక్షించండి, నేను ఏటీఎం యంత్రంలో చిక్కుకున్నాను, నా దగ్గర ఫోన్‌ కూడా లేదు. మా బాస్‌కు ఫోన్‌ చేయండి" అంటూ అతని బాస్‌ నంబర్‌ను అందులో పేర్కొన్నాడు. వెంటనే వినియోగదారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఇదేదో జోక్‌ అనుకొని పోలీసులు పట్టించుకోలేదట. అక్కడికి వచ్చి చూస్తే యంత్రం నుంచి వ్యక్తి అరుపులు చిన్నగా వినిపించడంతో వెంటనే స్పందించారు పోలీసులు. డోర్‌ను తెరిపించి అతన్ని బయటకి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది.