ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది జీఎస్టీనే : మోదీ

SMTV Desk 2018-07-01 12:53:51  gst day july 1, modi on gst day, gst on bjp, bjp

ఢిల్లీ, జూలై 1 : వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఈ రోజుకి ఏడాది పూర్తైన సందర్భంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2017 జులై 1 నుంచి వస్తుసేవల పన్ను అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఎన్నో సానుకూల మార్పులు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."జీఎస్టీ ఖ్యాతి మొత్తం దేశ ప్రజలకే దక్కుతుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది జీఎస్టీనే. జీఎస్టీ అమలై నేటికి ఏడాది పూర్తయింది. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. జీఎస్టీ కారణంగా ప్రజలకు దేశ ఆర్థిక వ్యవస్థపై ఒక స్పష్టత వచ్చింది. మొదటి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న జీఎస్టీ దేశ ప్రజల సహకారం వల్లనే విజయవంతమైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా జీఎస్టీ అనే పదాన్ని అలవోకగా ప్రజలు పలికేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఎన్నో సానుకూల మార్పులు తీసుకువచ్చింది. వారు దాన్ని అర్థం చేసుకోబట్టే రెండో సంవత్సరంలోకి జీఎస్టీ అడుగుపెట్టింది" అని మోదీ వ్యాఖ్యానించారు.