గుట్టుగా గుట్కా ప్యాకెట్లలో గంజాయి విక్రయం

SMTV Desk 2017-07-14 13:13:39  Anti-drug sales, Marijuana process, Luzu Gutka,Fake gutka gang, police

హైదరాబాద్, జూలై 14 : నగరంలో మత్తు పదార్ధాల విక్రయాలు చోటుచేసుకుంటున్న తరుణంలో కస్టమర్లను చేరేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గంజాయిని ప్రాసెస్ చేసి చౌక ధరలకు అందించేందుకు గుట్కా ప్యాకెట్లను ఎంచుకున్నారు. ప్రసుత్తం గుట్కా విక్రయాలను ప్రభుత్వం నిషేధించడంతో పోలీసులు దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారం లాభసాటిగా లేదనుకొన్న కొందరు లూజు గుట్కాపేరిట, పేరులేకుండా కేవలం రంగుల కవర్లలో గంజాయిని పెట్టి విక్రయిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, గుంటూరు, ఆదిలాబాద్, కరీంనగర్ , సూర్యాపేట, జడ్చర్ల, నర్సారావుపేట తదితర ప్రాంతాల్లో గుట్కా ప్యాకెట్ రూపంలో గంజాయి విరివిగా లభిస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ ఒక్కో గుట్కా ప్యాకెట్ ను రూ.500 పైనే విక్రస్తున్నట్లు నిర్ధారించారు. ఇటీవల ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని పోలీసులు తనిఖీ చేస్తుంటే అతని వద్ద నిషేధిత గుట్కా రాపర్ లు నాలుగు లభించడంతో తొలుత అవి సాధారణ గుట్కా ప్యాకెట్ లేనని భావించారు. కానీ ఆ ప్యాకెట్ లో గంజాయి పౌడర్ బయటపడింది. దీంతో సదరు విద్యార్ధిని పట్టుకొని విచారించగా హయత్ నగర్ లోని ఓ వ్యక్తికి ప్యాకెట్ కు రూ.500 చొప్పున చెల్లించి తీసుకున్నట్లు పోలీసుల గుర్తించారు. విద్యార్ధి ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరు సరఫరా చేస్తున్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు నకిలీ గుట్కా ముఠాపై నిఘాపెట్టి కీలక సమాచారం సేకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఓ లారీలో తీసుకొస్తున్న 2945 కిలోల గంజాయిని డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజన్స్ (డీఆర్ ఐ) పట్టుకుంది. ఈ కేసు విచారణ విస్మయం కలిగించే అంశం వెలుగు చూసినట్లు తెలిసింది. నగరంలోని కొన్ని ప్రాంతాలకు రహస్యంగా గుట్కాలను ఎక్కువ ధరకు విక్రస్తున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కూడా రంగంలోకి దించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నామన్నారు.