నీరవ్ దగ్గర భారత్‌ పాస్‌పోర్టు తప్ప.. ఇంకేం లేవు..

SMTV Desk 2018-06-29 12:32:13  nirav modi, pnb scam nirav modi, nirav modi one pass port, delhi

ఢిల్లీ, జూన్ 29 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును నిలువునా ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వద్ద భారత్‌ పాస్‌పోర్టు తప్ప ఇంకేమి లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా లండన్‌లో తలదాచుకున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్‌ మోదీ గతవారం బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం దేశాలను సందర్శించినట్లు వచ్చిన వార్తలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ ‌కుమార్‌ స్పందించారు. నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు ఐరోపా దేశాలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. నీరవ్‌ యూరప్ దేశాల్లో పర్యటించకుండా స్థానిక ప్రభుత్వాలకు అందుబాటులో ఉండాలని.. ఆయా దేశాల్లో ఎక్కడైనా ఉంటే తమకు తెలియజేయాలని భారత రాయబారి కార్యాలయాలతో పాటు ఎంపిక చేసిన దేశాలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఇంటర్‌పోల్‌ రెడ్ కార్నర్‌ నోటీసులు జారీ చేయనంతవరకు విదేశాల్లో నీరవ్‌ మోదీని అరెస్ట్‌ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. నీరవ్‌ ఎక్కడున్నారనే కచ్చితమైన ప్రదేశం తెలియకుండా.. మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.