మహిళా స్మగ్లర్‌ కొత్త పోకడ, మిక్సీలో బంగారం మిక్స్‌ చేసేసి...

SMTV Desk 2017-07-14 12:18:40  

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం మిక్సీ లోపలి భాగంలో ఉంచి స్మగ్లింగ్‌ చేస్తున్న 1.29 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న నగర మహిళ తనతో పాటు మిక్సర్‌ గ్రైండర్‌ను తీసుకొచ్చింది. ఈమె బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు విమానా శ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారుబ్యాగేజ్‌తో పాటు గ్రైండర్‌ను కూడా తనిఖీ చేశారు. మిక్సీ మోటర్‌ కింది భాగంలో ఉండే జిగ్‌ అనే ఉపకరణాన్ని తొలగించి, ఆ స్థానంలో బంగారం పెట్టి, పైన మెటల్‌ పూత పూసినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని మహిళను మరింత లోతుగా విచారిస్తున్నారు. మరోకేసులో 13 డ్రోన్‌ కెమెరాలు స్వాధీనం... శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు గురువారం 13 డ్రోన్‌ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో వచ్చిన ఇద్దరు హైదరాబాదీలు తమ వెంట భారీ టీవీతో పాటు 2 బ్యాగుల్లో తొమ్మిది చిన్న, 4 పెద్ద డ్రోన్‌ కెమెరాలను తీసుకొచ్చారు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు వారి బ్యాగులు తనిఖీ చేశారు. వీటిల్లో డ్రోన్‌ కెమెరాలు బయటపడ్డాయి. వీటిని విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా, వినియోగించాలన్నా కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతులు లేకుండా తీసుకువస్తున్న నేపథ్యంలో కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.