సొంత గూటికి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి..!

SMTV Desk 2018-06-27 14:29:48  nallari kiran kumar reddy, nallari kiran kumar reddy congress, ap former cm nallari kiran kumar reddy, hyderabad

హైదరాబాద్, జూన్ 27 : ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చని అధిష్ఠానం యోచిస్తోంది. ఆయన తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. నిన్న మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు కూడా ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరనున్నారని వస్తున్న ఊహాగానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.‌ సుబ్బిరామిరెడ్డి సైతం కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చినట్లు విలేకరుతో చెప్పడం విశేషం. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 2019లో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించడమూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించింది. ఈ క్రమంలోనే విభజన తర్వాత పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్రంలో పునర్‌వైభవం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుంది.