ఎనిమిదో రోజుకు చేరిన కడప ఉక్కు దీక్ష ..

SMTV Desk 2018-06-27 11:21:36  cm ramesh hunger strike, b.tech ravi, kadapa iron industry, kadapa

కడప, జూన్ 27 : ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించేది లేదని సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి పునరుద్ఘాటించారు. ఈ రోజుతో వారి దీక్ష ఎనిమిదో రోజుకు చేరింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ రోజుతో వారి దీక్ష ఎనిమిదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం వైద్యులు వారిరువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రమేశ్‌, రవిల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని.. బీటెక్‌ రవికి తక్షణ వైద్యం అందకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు రమేశ్‌, రవిలను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మాట్లాడుతూ.. తాము చేపట్టిన దీక్షపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలంతా తమకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. దీక్ష విరమించి పార్లమెంటులో పోరాడదామని విజ్ఞప్తి చేశారని.. అయితే ఉక్కు పరిశ్రమ సాధించేంతవరకు దీక్ష విరమించేది లేదని వారికి చెప్పినట్లు వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని సీఎం రమేశ్‌ పిలుపునిచ్చారు.