మోదీకి ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరిక..

SMTV Desk 2018-06-26 12:20:04  all time high threat, pm threat, intelligence report, modi,

ఢిల్లీ, జూన్ 26 : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనే ప్రముఖ వ్యక్తి మోదీనే కనుక.. ఆయనకు ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు ఆయా రాష్ట్రాలను హెచ్చరించాయి. ప్రధాని పర్యటన సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సందేశమిచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోదీనే అత్యధిక ప్రాధాన్యత గల లక్ష్యంగా ఉన్నారని జాతీయ భద్రతా కౌన్సిల్‌ ఇతర ఏజెన్సీలకు వెల్లడించింది. మోదీ రక్షణ గురించి ఏజెన్సీలు ప్రశ్నించగా కౌన్సిల్ ఈ విధంగా వెల్లడించింది. ఇటీవల నక్సలైట్ల నుంచి కూడా మోదీకి ముప్పు ఉందని ఓ లేఖ ద్వారా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్‌షోల సమయంలో మోదీ హత్యకు కుట్ర పన్నారని ఇటీవల పుణె పోలీసులు ఆరోపించారు. అయితే ఆయనను రోడ్‌షోలు చేయొద్దని, ప్రచార ప్రణాళికలు, ఓ చోటు నుంచి మరో చోటుకు ఏ మార్గంలో వెళ్తారనే విషయాలను బహిర్గతం చేయకపోవడమే మంచిదని నిఘా వర్గాలు సూచిస్తున్నట్లు సమాచారం. ఎల్లప్పుడూ ప్రధాని చుట్టూ ఉండే భద్రతాసిబ్బందికి హోం శాఖ అధికారులు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అవసరం లేకుండా మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దని చెప్పారు.