ధోని కంటే అతనే బెస్ట్..

SMTV Desk 2018-06-26 10:59:02  ms dhoni, ms dhoni vs tim paine, australian captain, england vs australia

మాంచెస్టర్‌, జూన్ 26 : భారత్ క్రికెట్ చరిత్రలో టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రత్యేకం. ఎందుకంటే భారత క్రికెట్‌ జట్టును ఉన్నత స్థానంలో నిలపడంతో పాటు రెండు వరల్డ్‌ కప్‌(వన్డే, టీ20 వరల‍్డ్‌ కప్‌)లు సాధించిన ఘనత ధోనిది. అటు కెప్టెన్‌గా, ఇటు వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా తనదైన ముద్రను ధోని సొంతం చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్‌లో ఉత్తమ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌లలో ధోనిదే టాప్‌ ప్లేస్‌. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైనీ దృష్టిలో ధోని కంటే ఉత్తమ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అట. ఈ మాట అన్నది ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సారథి టిమ్‌ పైనీ. ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఆదివారమే ముగిసింది. 0-5 తేడాతో ఆసీస్‌ వైట్‌వాష్‌కు గురైంది. ఇంగ్లాండ్‌ విజయాల్లో ఆ జట్టు ఆటగాడు బట్లర్‌ కీలకపాత్ర పోషించాడు . ఇతడు వికెట్‌కీపర్‌ కూడా. సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో బట్లర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ సారథి టిమ్‌ పైనీ... బట్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. "వన్డే క్రికెట్‌లో ఉత్తమ కీపర్‌-బ్యాట్స్‌మన్లలో బట్లరే ముందు వరుసలో ఉన్నాడు. ఇక్కడ అతనికి పోటీగా ఎవరూ లేరనేది నా అభిప్రాయం. ఎంఎస్‌ ధోని మంచి వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌. కానీ ప్రస్తుతం మాత్రం బట్లర్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతని దరిదాపుల్లో ఎవరూ లేరు. మహేంద్ర సింగ్‌ ధోనీ మంచి ఆటగాడు. కానీ, ప్రస్తుతం బట్లరే బెస్ట్‌" అని పైనీ వ్యాఖ్యానించాడు. జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ కూడా జరగనుంది. ఇంగ్లాండ్‌ గడ్డపై ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.