ఇందిరాగాంధీ హిట్లర్ తో సమానం : జైట్లీ

SMTV Desk 2018-06-25 17:07:39  arun jaitley, central minister arun jaitley, former pm indira gandhi, emergency time 1975

ఢిల్లీ, జూన్ 25 : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీను.. జర్మనీ నియంత హిట్లర్ తో పోల్చారు. ఆమె హయంలో 1975 జూన్ 25 అత్యవసర పరిస్థితి విధించి నేటికి 43 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆమె నాయకత్వంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ కేంద్ర మంత్రి అరుణ్ ‌జైట్లీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలకు చేశారు. నేడు జూన్‌ 25వ తేదీ సందర్భంగా జైట్లీ ఇందిరను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. " ఇందిర, హిట్లర్‌ ఇద్దరూ రాజ్యాంగాన్ని రద్దు చేసిన వారే. వారు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చుకునేందుకే రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్‌ చేయించి హిట్లర్‌ తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే హిట్లర్‌లా కాకుండా ఇందిరాగాంధీ భారత్‌ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా మార్చారు" అని జైట్లీ తన పోస్టులో పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వేధించిందని.. ప్రాథమిక హక్కులను కాలరాసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని జైట్లీ ఆరోపించారు. మీడియాపైనా ఆంక్షలు విధించారని, పలువురు ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారని జైట్లీ గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో 1975 జూన్ 26వ తేదీన ఆందోళన చేపట్టినందుకు తాను కూడా జైలుకు వెళ్లానని చెప్పారు.