ఐర్లాండ్‌ బయలుదేరిన టీమిండియా..

SMTV Desk 2018-06-23 15:57:44  india vs ireland, india tour of ireland, bcci, virat kohli

ఢిల్లీ, జూన్ 23 : విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు సుదీర్ఘ పర్యటన మొదలైంది. తొలుత ఐర్లాండ్‌.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన కోసం శనివారం కోహ్లి సేన బయలుదేరింది. ఈ నెల 27, 29న భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మొదట ఐర్లాండ్‌ పర్యటనకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. రోహిత్‌ శర్మ, మణికట్టు స్పిన్‌ ద్వయం చాహల్‌, కుల్‌దీప్‌, కోచ్‌ రవిశాస్త్రి, జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు, పలువురి ఆటగాళ్ల ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో ఉంచింది. అంతే కాకుండా విమానాశ్రయంలో విరాట్‌ కోహ్లీతో ఓ చిన్నారి దిగిన ఫొటోను బీసీసీఐ పంచుకుంది. ‘చిన్నారి రాధ టీమిండియా కెప్టెన్‌తో ఫొటో దిగాలనుకుంది అని బీసీసీఐ పేర్కొంది. డబ్లిన్‌లోనే ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐర్లాండ్‌ పర్యటన ముగించుకున్న అనంతరం కోహ్లి సేన అటు నుంచి నేరుగా ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది.