మాల్యాకు ఆ ట్యాగ్ ఇవ్వాలి : ఈడీ

SMTV Desk 2018-06-22 16:51:19  vijaymalya, vijaymalya, enforcement directorate, vijaymalya london

ఢిల్లీ, జూన్ 22 : ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యాకు ‘పారిపోయిన నేరస్థుడి’ ట్యాగ్‌ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరుతోంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ‘పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్’ కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని, ఆయనకు చెందిన రూ.12,500కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ఈడీ ముంబయి కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. మాల్యాకు చెందిన స్థిర, చరాస్తులన్నీ తక్షణమే జప్తు చేసే అవకాశం ఇవ్వాలని దరఖాస్తులో కోరినట్లు తెలిపారు. మాల్యాకు పారిపోయిన నేరస్థుడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరేందుకు.. ఈడీ గతంలో అతడిపై పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) కింద దాఖలు చేసిన రెండు ఛార్జిషీట్లను ఆధారాలుగా కోర్టులో చూపించింది. పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం కేసు విచారణ ముగిసిన తర్వాతే ఈడీకి ఆస్తులు జప్తు చేసే అధికారం ఉంటుంది. ఇందుకు ఎన్నో సంవత్సరాలు సమయం పడుతుంది. కాబట్టి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద తక్షణమే ఆస్తుల జప్తునకు అవకాశమివ్వాలని ఈడీ కోరుతోంది. మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం‌ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది.