పవన్ కళ్యాణ్, సీఎం.. ఎడమొహం.. పెడమొహం..

SMTV Desk 2018-06-22 13:22:47  pawan kalyan, chandrababu naidu, janasena vs tdp, guntur

గుంటూరు, జూన్ 22 : రాజకీయాల్లో శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. దేశ రాజకీయాలుగాని, రాష్ట్ర రాజకీయాలు గానీ ఏవైనా కావచ్చు. అభివృద్ధి అని తొలుత చేతులు కలిపి.. తర్వాత విడిపోయి మాటల తూటాలతో ఒకరిమీద ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ప్రస్తుతం ఈ కథ అంతా ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరినొకరు ఎదురెదురుగా కలుసుకున్న కనీసం పలకరించుకోలేదు. కనీసం ఒకరినొకరు చూసుకోలేదు. అసలు విషయంలోకి వెళితే.. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా, రమణీయంగా నిర్మితమైన ఆలయంలో దశావతార వెంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు. ముందుగా దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆలయానికి వచ్చారు. మరో 15 నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌‌ చేత పూజలు చేయించారు. ఆలయాన్ని సందర్శించే సమయంలో పవన్‌కల్యాణ్‌‌, చంద్రబాబు కాసేపు పక్కపక్కనే నడిచారు. అయినప్పటికీ ఒకరినొకరు పలకరించుకున్నట్లు కనిపించలేదు. నడుస్తున్నంత సేపు ఇద్దరూ ఎడమొహం.. పెడమొహం.. గానే వ్యవహరించారు. కాసేపటి తర్వాత పవన్‌కల్యాణ్‌‌ దూరంగా వెళ్లిపోయారు. ఆలయంలో కొందరు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్న సమయంలోనూ పవన్‌ ఆయన పక్కనుంచే వెళ్లినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం నెలకొంది. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆలయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.