అహ్మదాబాద్, జూన్ 21 : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివాహం కాలేదంటూ ఇటీవల మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అన్నారు. ఇది కాస్తా సోషల్‌మీడియా, స్థానిక మీడియాలో వైరల్‌గా మారడంతో ఆనందిబెన్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ స్పందించారు. ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. గుజరాత్ మాజీ సీఎం అయిన ఆనందిబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఈ నెల 19న స్థానిక పత్రికల్లో వచ్చాయి. ఆ తర్వాత సోషల్‌మీడియాలోనూ వైరల్‌గా మారాయి. దీంతో ఆనందిబెన్ వ్యాఖ్యలపై తమ సోదరి స్పందిచాల్సి వచ్చిందని జశోదాబెన్ సోదరుడు అశోక్ వెల్లడించారు. "లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వేసిన నామినేషన్లో తనకు వివాహం అయ్యిందని, భార్య పేరు జశోదాబెన్ అని ఆయనే(ప్రధాని మోదీ) స్వయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆనందిబెన్ అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు. ఆనందిబెన్ వ్యాఖ్యల గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రధాని మోదీకి పెళ్లి కాలేదని ఎలా అంటారు. ఉన్నత చదువులు చదివిన ఓ మహిళ(ఆనందిబెన్).. ఓ సామాన్య టీచర్(జశోదాబెన్) గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. నా వరకు ఆయన(మోదీ) ఎంతో గౌరవనీయమైన వ్యక్తి. రాముడి లాంటి వారు" అని జశోదాబెన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.