వరుస ట్వీట్లతో టీడీపీపై విరుచుకుపడిన పవన్..

SMTV Desk 2018-06-21 12:45:42  pawankalyan fire on tdp, tdp vs janasena, ramanadeekshitulu, ttd issue

అమరావతి, జూన్ 21 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార టీడీపీ పార్టీపై మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు అండగా నిలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో రాష్ట్ర ప్రభుత్వం తీరును పవన్ ఎండగట్టారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకూ సేకరించిన భూములు చాలని, ఇకపై రైతుల నుంచి భూములను సేకరించొద్దని ప్రభుత్వానికి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరుగుతున్న పరిణమాలపై కూడా పవన్‌ స్పందిస్తూ.."రమణ దీక్షితులు ప్రస్తావిస్తున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. పింక్‌ డైమండ్‌తో పాటు ఇతర ఆభరణాల అదృశ్యంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరిగా లేదని పవన్ అన్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో తనను కలిసిన ఓ వ్యక్తి టీటీడీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు ఓ మిడిల్‌ ఈస్టర్న్‌ దేశానికి తరలిపోయాయని రాసుకొచ్చారు. ఈ విషయం కొంతమంది టీడీపీ నాయకులకు తెలుసని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అందుకే రమణ దీక్షితుల ఆరోపణలు తనకు ఎలాంటి షాక్ ఇవ్వలేదని చెప్పారు. జూన్ 23న పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.