ఇరగదీసిన ఇంగ్లాండ్ ..

SMTV Desk 2018-06-20 11:51:40  england record, england vs australia, alex hales, andrew tie

నాటింగ్‌హామ్‌, జూన్ 20 : ఇంగ్లాండ్ జట్టు వన్డేల్లో పెనుసంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై బ్రిటిష్ జట్టు రెచ్చిపోయి వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డును సాధించింది. ఆసీస్ తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం మూడో వన్డేలో మోర్గాన్‌ సేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 481 పరుగుల రికార్డు స్కోరు చేసింది. 2016లో మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టే పాకిస్థాన్‌పై 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తొలుత టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అలెక్స్‌ హేల్స్‌ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్‌ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో సాధించగా.. జేసన్‌ రాయ్‌ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్‌ మోర్గాన్‌ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్‌ ధాటికి ఆసీస్‌ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్‌ 92, స్టొయినిస్‌ 85 పరుగులు సమర్పించుకున్నారు. భారీ స్కోరును సాధించేందుకు బ‌రిలోకి దిగిన ఆసీస్ ల‌క్ష్య ఛేద‌న‌లో విఫ‌ల‌మైంది. 37 ఓవ‌ర్లలో 239 ప‌రుగులకే ఆలౌట్ అయ్యింది. హెడ్ (51), స్టొయినిస్ (44) మినహా మిగిలిన వారెవ‌రూ చెప్పుకోద‌గ్గ స్కోరు చేయ‌క‌పోవ‌డంతో 242 ప‌రుగుల భారీ తేడాతో ఓట‌మి పాల‌యింది. 5 వన్డేల సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అలెక్స్ హెల్స్ కు దక్కింది.