మాజీ యాంకర్‌ తేజస్విని ఆత్మహత్య..

SMTV Desk 2018-06-18 14:40:28  krishna anchor suicide, krishna suicide, vijayawada, mbmr colony

విజయవాడ, జూన్ 18 : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలో శనివారం రాత్రి జరిగింది. ఓ మాజీ యాంకర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన పవన్‌కుమార్, తేజస్విని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఏడాదిన్నర క్రితం వీరికి ఒక పాప జన్మించింది. అప్పట్నుంచీ పవన్ తల్లి వెంకట్రావమ్మ కొడుకు కోడలు వద్దే ఉంటోంది. పవన్ ఉయ్యూరులోని బజాజ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తూ ఈడుపుగల్లులోని ఎంబీఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. గత కొంతకాలంగా పవన్ తేజస్వి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 14న పవన్ షిర్డీ వెళ్లగా... తేజస్విని, ఆమె కుమార్తె, పవన్ తల్లి వెంకట్రావమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో వెంకట్రావమ్మ కోడల్ని పిలిచేందుకు ఆమె గది వద్దకు వెళ్ళింది. ఎంత పిలిచినా కోడలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపు పగలగొట్టి చూడగా తేజస్వి గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేజస్విని గతంలో విజయవాడలోని ఓ ప్రైవేటు ఛానల్‌లో యాంకర్‌గా‌ వ్యవహరించారు.