చందాకొచ్చర్‌పై వేటు పడనుందా..!

SMTV Desk 2018-06-18 13:18:19  icici ceo issue, Chanda Kochhar, CEO Sandeep Bakhshi, mumbai

ముంబై, జూన్ 18 : ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌ పని తీరుతో బ్యాంకు లాభాల బాట పట్టింది. కాగా ఒక్క వీడియోకాన్‌ వ్యవహారంతో ఆమె భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌కు 2012లో రుణాలు మంజూరు చేసినట్లు చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఇటీవల బ్యాంకు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై నేడు బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశం నేడు జరగనుంది. అయితే ఐసీఐసీఐ సీఈవో పదవి నుండి చందాకొచ్చర్‌ను తప్పించనున్నారా..? ఇందులో సీఈవోగా చందాకొచ్చర్‌ను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై బోర్డు సభ్యులు చర్చలు జరపనున్నట్లు ఈ వ్యవహరాలతో సంబంధం ఉన్న వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దీంతో పాటు వీడియోకాన్‌ వ్యవహారంలో చందాకొచ్చర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రతిపాదించిన శ్రీకృష్ణ కమిటీపై కూడా బోర్డు సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా బ్యాంకు సీఈవోగా కొనసాగుతున్న చందాకొచ్చర్‌ పదవీకాలం 2019 మార్చిలో ముగియనుంది. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో చందాకొచ్చర్‌ను సీఈవో పదవి నుంచి తప్పించాలని బోర్డు భావిస్తోంది. దీనిపై కూడా నేడు బోర్డు సభ్యులు చర్చించనున్నారు. చందాకొచ్చర్‌ను తొలగించి.. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్‌ లైఫ్‌ సీఈవో సందీప్‌ బక్షీకి తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.